శ్రీ రామ కీర్తిని లోన తలచుచు
సీత సాధ్విని మనమున కొలుచుచు
మనసు పూర్తిగ లగ్న పరచి
హనుమ మరల సీత స్థితిపై ఆలోచించెను 1
హనుమ తిరిగి సీతను చూచుచు
ఆమె స్థితిపై దుఃఖ పడుచు
నీరు నిండిన కన్నులు గల్గి
మనమున ఎంతో చింత చెందెను 2
"లక్షమణునితో అమ్మగ పిలువ బడుతు
తన గురువుల చేతను పొగడబడుతు
వుండు సీతకే తిప్పలు తప్పకున్న
మనుషులేరీతి కాలము గడుపగలరు? 3
శ్రీ రామ పరాక్రమము చూసినదియు
లక్ష్మణుని శక్తిని తెలిసినదియు
ఐన సీత, వాన కాలపు గంగ నదివలె
నిబ్బరముగ మనమున నున్నది 4
అతని గుణగణములు, అతని శౌర్యము
అతని వయసుతొ రాముడీమెకు తగిన వాడే
ఈమె సొగసులు ఈమె అందము
ఈమె వంశపు చరితతొ సీత ప్రభువుకి తగినదే" 5
లక్ష్మి కళతో వెలిసిన సీతను
బంగరు వన్నెతో మెరిసెడి సీతను
చూసిన మారుతి మనమున నుడివెను
రాముని కొరకై మదిలో పలికెను 6
"ఈ కమల దళాక్షి నెపమునేకద
పరమ వీరుడు వాలి జచ్చెను
రావణునితో బలమున సరియగు
కబందుడశువులు బాసి ఉండెను 7
శంబర ఇంద్రుల బోలు శౌర్యము
ఉన్న రాముని చేత ఇంకను
వివిధ మాయలలో ఆరి తేరిన
విరాదుడంతటి వాడు చచ్చెను 8
జనస్థాన మందు రాముడుండగ
పదునాల్గు వేల రక్కశి మూకలు
అగ్ని కీలలకు చిక్కినట్టుగ
అతని బాణములకాహుతయ్యిరి 9
లోక విదితమగు రామ శక్తికి
ఖరుడు ఓడి మట్టిగరచెను
త్రిశిరుడెప్పుడో అశువులొదిలెను
దూషణునికొచ్చెను వీర మరణము 10
సీత నెపముననే కదా
వాలి వధ మరి జరిగి ఉన్నది
వానర రాజ్యపు విలువలెన్నో
శుగ్రీవుని చేతికి అంది ఉన్నది 11
అతిలోక సుందరగు సీత కొరకే
నేను, నదీ మాతల ప్రభువనబడు
సముద్ర దేవుని దాటి వచ్చి
ఈ లంకా నగరము తిరిగి ఉన్నది 12
సీత కొరకై అన్ని లోకములు
రాముడేకము చేసియున్నను,
సముచిత కార్యమదియని మనమున
నాకు తప్పకు తోచుచున్నది 13
త్రిలోకములయొక్క ఆధిపత్యమును
జనక నందనయగు సీతకు పోల్చగ
ఆమెలొ పదహారొవ వంతుకు కూడ
మూడులోకములు సరి రాబోవు 14
మిథిలా నగరికి రాజగు జనకుని
ముద్దుల పుత్రిక, జానకి మాత
రాముని ప్రియ సఖి పరమ సుందరి
భర్తను మనమున నిల్పిన సాధ్వి 15
భూమిని జనకుడు దున్ను చుండగ
పద్మపు పుప్పొడి బాగుగ కలసిన
పుడమిని చీల్చుకు బయటకు వచ్చిన
అయోనిజ, భూసుత ఈ సీతా మాత 16
యుద్ధములందు వీపు చూపని
పరాక్రమ మందున పోలిక లేని
దశరధ రాజుకు ప్రధమ కోడలిగ
లోక విదిత ఈ సీతా మాత 17
కోదండ రాముని పట్టమహిషి
పరమ వీరుడగు రాముని సహచరి
అట్టి దేవియగు సీతా మాత
రాక్షస మూకల చెరన చిక్కినది 18
రాముని పై గల ప్రేమ పొంగగ
ఆకలి దప్పులు లెక్క చేయక
అడవి జంతువులన్న భయము చెందక
కంద మూలములు తింటూ తిరుగుచు 19
రాజ భోగములు పక్కకు నెట్టి
రాముని సేవలొ సుఖములు చూచుచు
కటిక నేలనే పరుపుగ తలచుచు
రాముని కస్ఠము సగము పంచుకొను 20
చల్లని నవ్వుల వెలిగెడి సీతకు
కస్ఠములెరుగని జనక నందినికి
పువ్వులు తగిలిన కందెడి కోమలికి
ఎన్ని కష్టములు వచ్చెనొ గద 21
రావణ వేధల నలిగెడి సీతకై
లోకములన్నియు తిరిగెడి రాముడు
దప్పిక గొని, ఎడారి తిరుగుచు
నీటి చాయకై వెదకెడి బాటసారివలెనుండె 22
లంకను చేరి, రావణు దునిమి
సీతను చూసిన రాముని స్థితి
పోయిన రాజ్యము చేతికి చిక్కగ
ఆనందము పొందెడి రాజువలె నుండు 23
రాచరికపు సుఖములు వదిలి
వూసులాడుటకు చెలియలు లేక
ప్రియుడగు రాముని చూసెడి ఆశతొ
పంటి బిగువున కాలమీడ్చుతున్నదీమె 24
రాక్షస మాయకు లోబడిపోక
పువ్వుల తావి, ఫలముల ఘుమ ఘుమ
చక్కని సంగీత ద్వనుల నడుమ
రాముని మనమున నిల్పిన దామె 25
ఆభరణములకన్నిటిని మించిన
భూషణము పతియె ఈ జగతిన ఇంతికి
అట్టి పతికి దూరమైన సీతను
అకటా వీడెను ముఖమున కళయు 26
ఇట్టి సీతను వీడివది రాముడు
మనసున కృంగక లగ్నము చెదరక
క్షణమును విడువక మాతను వెదకుచు
అనితర సాధ్యపు శోధన నుండెను 27
తుమ్మెదల వంటి కురులు గలదని
కలువ కన్నుల సుందరి ఆమెని
రాజ భొగములకు తగినది ఈమెయని
తెలిసిన నాకే దుఃఖము ఉబుకుతున్నది 28
రామ లక్ష్మణుల శౌర్యము రక్షగ తిరిగి
జనకుని ప్రేమతొ గారాల బిడ్డగ పెరిగి
రక్కసి మూకల వికృత చూపుల నడుమ
కాంతివిహీనగ, ఏకవస్త్రగా ఎలా చూడను? 29
మంచు తాకిడికి వాడిన కలువలాగ
తోడును వీడిన చక్రవాకము లాగ
కస్థాలకు లొంగి కాంతి విహీనగ
జాలినిగొలిపే స్థితిలో సీతను ఎలా చూడను? 30
పూల భారాన వంగిన కొమ్మలతొ
అశోక మామెనింకయు కృంగదీసెను
కరిగిన మంచును నేలకు జార్చుచు
ఎగసిన చండ్రుడు విరహమమెలొ పెంచుచుండెను 31
నిశిత దృస్టితో పరిశీలించి,
ఆమెయె సీతని నిర్ధారించి
తర్క శాస్త్రమున నిష్ణాతుడగు
హనుమ ఆ చెట్టుపై వగచుచు నిల్చె 32
Wednesday, May 30, 2007
Subscribe to:
Posts (Atom)